‘కొందరు మహానుభావుల్ని కలిసినప్పుడు మానసికంగా మనలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం అలాంటి మార్పులే నాకు కలిగాయి’’అంటున్నారు సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ రజనీకాంత్ సరసన ‘లింగా’లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనుభవాల గురించి, రజనీకాంత్ సాహచర్యంలో ఎదురైన అనుభూతుల గురించీ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో ముచ్చటించారు. ‘‘సల్మాన్, అక్షయ్, అజయ్‌దేవగన్, షాహిద్‌కపూర్... ఇలా చాలామంది స్టార్లతో పనిచేశాను. కానీ... వారి వద్ద నేర్చుకోలేని ఎన్నో విషయాలను ‘లింగా’ సెట్‌లో నేర్చుకుంటున్నాను. రజనీ సార్‌తో పనిచేసిన రోజులన్నీ నా జీవితానికి చాలా విలువైనవి.
ఆయన ఓ యూనివర్శిటీ. ఎంత నేర్చుకున్నా ఇంకా తెలీని విషయాలు ఆయన దగ్గర ఉంటాయి. రకరకాల దశల్ని దాటుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిన మహానుభావుడు ఆయన. వాటిలోని కొన్నింటిని చెప్పి... నాలో భక్తిభావానికి పునాదులు వేశారు. అధిక బరువు శరీరానికి మంచిది కాదన్న విషయం నాకు చాలామంది చెప్పారు. కానీ... రజనీ సార్ చెప్పే విధానం వింటే... శరీరాన్ని ఓ దేవాలయంలా భావిస్తారు ఎవరైనా. కెమెరా ముందు రజనీకీ, కెమెరా వెనుక రజనీకీ అసలు పొంతనే ఉండదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారామె.
బాలీవుడ్ తారలు ఇటీవల పాటలు పాడటం ట్రెండ్‌గా మారింది. సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, ఆలియా భట్, శ్రద్ధాకపూర్ ఇప్పటికే తమ గానాన్ని వినిపించారు. తాజాగా, సోనాక్షిసిన్హా కూడా అదే బాటలో అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేవర్’ చిత్రంలో ‘లెట్స్ సెలిబ్రేట్’ అంటూ పాడనుంది. తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరో పాత్ర పోషిస్తున్నాడు.