మెరుపు తీగకు చిరునామా అన్నట్లుగా సన్నగా ఉండేవారు ఐశ్వర్యారాయ్. కానీ, పాప పుట్టిన తర్వాత బొద్దుగా తయారయ్యారు. తల్లయిన రెండు, మూడేళ్ల తర్వాత కూడా బరువు తగ్గకపోవడంతో విమర్శలపాలయ్యారు ఐష్. అయితే, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఐష్ ఇటీవల బాగా బరువు తగ్గారు. హఠాత్తుగా ఇంత స్లిమ్ కావడానికి గల కారణం ఏంటి? అనే ప్రశ్న ఐశ్యర్యా రాయ్ ముందుంచితే - ‘‘మా అమ్మాయి ఆరాధ్య. తను నడవడం మొదలుపెట్టిన తర్వాత ఇంటిల్లిపాదినీ పరుగులు పెట్టిస్తోంది.
తన పనులు చేస్తూ, తన వెనకాల పరిగెత్తడంవల్ల క్రమ క్రమంగా బరువు తగ్గాను. అఫ్‌కోర్స్ వ్యాయామాలు కూడా చేశాననుకోండి’’ అని పేర్కొన్నారు. తల్లయిన తర్వాత ఐశ్వర్యా రాయ్ అంగీకరించిన తొలి చిత్రం ‘జాజ్బా’. సంజయ్ గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం ఐశ్వర్యా రాయ్‌ని బరువు తగ్గమని సంజయ్ చెప్పారనే వార్త వినిపించింది. అయితే, అలాంటిదేమీ లేదనీ, ఐష్ ఇప్పుడు బాగున్నారనీ ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు.
No comments:
Post a Comment