అవయవదానం చేయడం మరణపుటంచుల్లో ఉన్న వారికి పునర్జీవం పోయడమే. ఇంతకంటే గొప్పదనం మరొకటి ఉండదు. అలాంటి దానానికి తాను సైతం అంటున్నారు ప్రముఖ నటి అసిన్. అవసరం అయినవారికి ఉపయోగపడేలా తన అవయవాలను దానం చేస్తానని అసిన్ వెల్లడించారు. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా అభిషేక్‌బచ్చన్ సరసన ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో నటిస్తున్నారు.
తమిళంలో మంచి చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉందంటున్న అసిన్ ప్రస్తుతం పలు కథలను వింటున్నారు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ పలువురు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ముంబయిలోని ఒక సామాజిక సేవా సంస్థ నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారిలో ఒకరిగా రక్తదానం చేశారు. అంతేకాదు తన కళ్ల నుంచి అన్ని అవయవాలు దానం చేయనున్నట్లు ప్రకటించారు.
అందుకు సంబంధించిన పత్రంలో అసిన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. అది ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు. అవసరం అయిన వారికి ఉపయోగపడాలనే తన అవయవదానం చేసినట్టు వివరించారు. తన ఈ నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి దాయకం అవుతుందని నమ్ముతున్నట్లు అసిన్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment